శ్రీ వేదాద్రి మహర్షి గురువు గారి దివ్య ఆశీస్సులతో అందరికీ సుఖినోభవన్తు.
నా పరిచయం
నా బాల్యం :
నా పేరు అగస్త్య శ్యామల. నేను పుట్టింది తేదీ. 27-03-1970 విజయవాడలో మంచి పేరువున్న నవరంగ్ ధియేటర్ ప్రక్కనే వున్న ఇంట్లో . అప్పట్లో ఇప్పటిలా A/c ధియేటర్లు లేవు కాబట్టి సినిమాలో మాటలు , పాటలు కొంత బయటకు వినిపిస్తూ ఉండేవి. బహుశా అవి వింటూ, ఆ సినిమాలు చూస్తూ , నాకు కధలు , పాటలపై ఆసక్తి పెరిగింది అనుకుంటాను. అప్పటి ఆసక్తే ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ద్వారా మీ ముందు రాగలగడం. నాకున్న గొప్ప అదృష్టం ఏంటంటే , నేను పుట్టింది , పెరిగింది, వివాహం జరిగింది , నాకు పిల్లలు కలిగి , వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయి వారు స్థిరపడి - ఇవన్నీ నేను ఆ నవరంగ్ ధియేటర్ ప్రక్కన ఉంటున్న ఇంటిలోనే కావడం.
మాది ఉమ్మడి కుటుంబం . నాన్న, అమ్మ( నందికోళ్ల . వెంకట రమణ & రాజ్యలక్ష్మి) ఇంకా అమ్మమ్మ , మేనమామ ,మేనత్తలు, పెద్దమ్మ ,పెదనాన్న , పిన్ని బాబాయిలు అందరూ కలిసి హోటల్ నడిపేవారు. ఇలా మేము (అన్నయ్య విజయకుమార్, తమ్ముడు శ్రీనివాస్ , చెల్లెలు అనురాధ ) ఇంకా పెద్దమ్మ , పిన్ని , మేనమామల పిల్లలు అందరం మాంటిస్సోరి స్కూల్లో చదువు కుంటూ , ఆటపాటలతో మా బాల్యం అంతా సంతోషంగా గడిచింది.
చిన్నప్పటినుండి మాంటిస్సోరి స్కూల్లో నేర్పించిన పాటలు , డాన్సులు అందరికి చూపిస్తూ చుట్టాలందరిలో మంచి పేరు సంపాదించుకున్నాను. ఉదయానే పేపరులోని వార్తలు అందరికి వినిపించేలా గట్టిగా చదవడం, కథల పుస్తకాలు చదవడం, అందరికి వినిపించడం నాకు చాలా ఇష్టం . మంచి ,మంచి కవితలు చదవడం , రాయడం స్నేహితులతో వాటి గురించి చర్చలు చేయడం , వేరు వేరు ఊళ్లలో వున్న బంధువులకు ఉత్తరాలు రాయడం , వినాయకచవితికి, స్వామికి పూజ చేసి , వ్రత కథా పుస్తకం చదవడం,రేడియోలో వచ్చే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు , శ్రీమతి పి . సుశీల , శ్రీమతి ఎస్ . జానకిగార్ల సినిమా పాటలు, శ్రీమతి వేదవతిగారి లలిత సంగీతం వింటూ , అవకాశం వచ్చినప్పుడల్లా మేము కూడా రేడియో స్టేషన్లో ధియేటర్ రూంలో మైక్ ముందు పద్యాలు పాడి, అవి రేడియోలో ప్రసారమయ్యేటప్పుడు ఇంట్లో అందరం రేడియో దగ్గర కూర్చుని వింటూ ఆనందించడం, PONDS COMPANY వాళ్ళు పెట్టిన ADVERTISEMENT SLOGAN పోటీలో రూ . 100 బహుమతి గెలిచి దానితో బ్యాంకులో ఖాతా తెరవటం ఇవన్నీ మంచి జ్ఞాపకాలు. నాలో వున్న ఈ కొంచెం నేర్పు తర్వాత నా ఉద్యోగ నిర్వహణలో నాకు బాగా ఉపయోగపడింది.
చదువు ,వివాహం , కుటుంబం :
నేను ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ (B.Com) వరకు స్టెల్లా కాలేజి లో చదివాను. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగానే మేనమామ అగస్త్య. నరసింహరావుతో తేదీ . 18-08-1988 న వివాహం జరిగింది. తేదీ. 24-07-1991 న-చి. ల. సౌ . బ్రహ్మణి పుట్టింది.
తర్వాత తేదీ. 27-11-1993 న చి. ల. .సౌ.లక్ష్మీ తేజస్వి పుట్టింది. చాలా సంవత్సరాలు నాకు గృహిణిగా వుంటూ , పిల్లల ఆలనాపాలన లోనే సమయం గడిచిపోయింది. పిల్లలకు మంచి కధలు చెప్పటం, చదువులో వారికి అర్ధం కాని విషయాలను , వారికి ఎలా చెపితే అర్ధం అవుతుందో పరిశీలించికొని తిరిగి వాళ్లకు చెప్పి , వారికి ఆ పాఠాలపై మరింత ఆసక్తి కలిగేలా ప్రయత్నించేదాన్ని .
పెద్దమ్మాయి బ్రహ్మణి ఆమె మూడు నంవత్సరాల వయసు నుండి పాటలు పాడుతూ, అందరినీ ఆకట్టుకునేది. YOU TUBE CHANNEL లో పాటలు పాడటం చేస్తుండేది. అలాగే చదువులో కూడా రాణించి, M.Tech చేసి NIMRA ENGINEEING COLLEGE (AAGIRIPALLI) లో అసిస్టెట్ ప్రొఫెసర్ గా పనిచేసింది.చాగంటి.హరిచరణ్(బ్యాంక్ఉద్యోగి) తో వివాహమైనది. ప్రస్తుతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి , తన పాప 2 సం || మనస్విని చూసుకుంటూ , స్వంతంగా ఆన్ లైన్లో వ్యాపారము ప్రారంభించింది.
చిన్నమ్మాయి లక్ష్మీ తేజస్వి చిన్నతనం నుండి మంచి వాక్చాతుర్యంతో అనేక డిబేట్లలో పాల్గొనేది. సబ్జెక్టులలో ఏ విషయానైనా తన స్నేహితులకు చక్కగా వివరించేది. స్కూల్లో , కాలేజీ లో చక్కని గుర్తింపు తెచ్చుకొని , CMA INTER చేసి , M.B.A (HR) తో పాటు, మహనీయులు, గురువులు శ్రీ వేదాద్రి మహర్షిగారి SKY ధ్యాన మండలి ద్వారా యోగ విద్యలో గురువుగారు శ్రీమతి . లేళ్ల . అనురాధ గారి వద్ద శిక్షణ పొందింది. దుబాయి లో 1 1/2 సంవత్సరం పాటు యోగ అధ్యాపకురాలిగా పనిచేసింది. తను యోగ ఆసనాలపై YOU TUBE CHANNEL నిర్వహిస్తుంది. లక్ష్మీ తేజస్విని చేసే యోగా ఆసనాలను చూస్తూ , తన పాప 4 సం || శ్రీదేవి కూడా చక్కగా యోగాసనాలను వేస్తుంది . లక్ష్మీ తేజస్వి ప్రస్తుతం దుబాయిలోని "S S INTERNATIONAL LLC " వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి , దిగుమతుల సంస్థలో TRADE SALES OFFICER గా పని చేయుచున్నది.
ఉద్యోగం :
పితృ సమానులు శ్రీ . పేర్ల .భీమారావు గారు స్థాపించిన OK SILKS అనే వస్త్ర వ్యాపార సంస్థ ( ఇప్పుడు SURYA CLOTH STORES & SAAKALYA బ్రాంచిలతో , ఐదు తరాల కస్టమర్లతో నిర్వహింపబడుతుంది ) నందు, నాకు 35 సం || ల వయసులో తేదీ. 18-08-2005న అకౌంటెంట్ గా ఉద్యోగంలో చేరాను. శ్రీ భీమారావు గారు మేనేజ్ మెంట్ మరియు వారి కుమారులు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు అకౌంట్ వ్యవహారాలు , శ్రీ వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీ శ్యామ్ కృష్ణ స్వామి గార్లు కొనుగోలు , అమ్మకాలు నిర్వహిస్తూ ఉండేవారు.
శ్రీ పేర్ల .భీమారావుగారు వ్యాపార సంబంధమైన, మరియు ఇతర అంశాలపై చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవారు. ఏ విషయానైనా అవతలివారికి చక్కని భావంతో చేరాలనే గట్టి సంకల్పం వారిది. అందుకు చక్కని మాటలతో, సంతృప్తికరంగా ఉండేలా ఉత్తర-ప్రత్యుత్తరాలు, వ్యాపార ప్రకటనలు రాయడం ఇవన్నీ నా ఉద్యోగనిర్వహణలో వారి వద్ద నేను నేర్చుకున్న పాఠాలు.
వ్యవస్థాపకులు శ్రీ పేర్ల .భీమారావుగారు వారి సతీమణి మాతృ సమానురాలు శ్రీమతి .సరస్వతమ్మగారికి నా పాదాభివందనములు . వారి కుమారులు , కోడళ్ళు - శ్రీ శ్యామ కృష్ణ గారు - వారి సతీమణి శ్రీమతి వందన గారు , శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు - వారి సతీమణి శ్రీమతి దుర్గా వెంకటరమణ గారు , శ్రీ వెంకటేశ్వరరావు గారు - వారి సతీమణి శ్రీమతి దేవికారాణి గారు , శ్రీ శ్యామ్ కృష్ణ స్వామి గారు - వారి సతీమణి శ్రీమతి ఆది లక్ష్మిగారు నన్నువారి కుటుంబ సభ్యురాలిగా ఆదరించి, నాకు మంచి స్థానాన్ని ఇచ్చారు . వారందరికీ నా హృదయపూర్వక నమః సుమాంజలి ఘటిస్తున్నాను.
ఎంతో మందికి జీవనాధారాన్ని చూపించిన OK SILKS మూడు పువ్వులు , ఆరు కాయలుగా వికసించాలని, జగద్గురువు " శ్రీ కృష్ణ భగవానుని"కోరుకుంటున్నాను.
"మనశ్రీ కథాలయ "కు నాంది
ఈ బ్లాగ్ తయారుచేయడానికి ఒక ముఖ్య కారణం నాలో చాలా సంవత్సరాలుగా పిల్లలకోసం ఒక మంచి వేదిక తయారుచేయాలి అనే ఆలోచన. ఎన్నాళ్ళ నుంచో పిల్లలకు సంభందించిన పాటలు, పద్యాలు డాన్సు, కవితలు, బొమ్మలు - ఇలా ఏన్నెనో విషయాలు ఒక చోటకు తేవాలని కోరిక .
నా ఆలోచనను ఆచరణలోకి తేవడానికి ఎక్కడ మొదలుపెట్టాలి ? ఎలా మొదలుపెట్టాలి ? అనేది ప్రశ్నగానే ఇన్నాళ్లు మిగిలిపోయింది. కొత్త టెక్నాలజీ ద్వారా ఎంతోమంది చాలా ముందుకు వచ్చి, ఆన్‌లైన్ ద్వారా BLOGS, WEBSITES,YOU TUBES నిర్వహిస్తూ ఎన్నో మంచి విషయాలను ప్రపంచానికి అందిస్తున్నారు. నేను టెక్నాలజీ పై కొంత అవగాహన చేసుకొని నా ఆలోచనలో ఉన్నవేదికను ఇప్పుడు నా బ్లాగ్"మనశ్రీ కథాలయ " ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను.
బ్రహ్మణి కుమార్తె " చి. మనస్వి " మరియు లక్ష్మీ తేజస్వి కుమార్తె చి. " శ్రీదేవి " లకు
కథలు అంటే చాలా ఇష్టం. వారి కోసం నేను "కోకిలమ్మ"కథ ఆడియో రికార్డు చేయగా ,బ్రహ్మణి దానికి వీడియో జత చేసింది. అలా "కోకిలమ్మ" నా మొదటి కథగా "మనస్వి & శ్రీదేవి ల" పేరిట " మనశ్రీ కథాలయ " బ్లాగ్ ప్రారంభానికి నాంది పలికింది.
మాతృ భాష పై ఎంతో మక్కువ అవడం వలన ఈ బ్లాగును కూడా ముందుగా తెలుగు భాషలోనే ప్రారంభిస్తున్నాను.
" మనశ్రీ కథాలయ " వేదికకు ఆహ్వానం
మనశ్రీ కథాలయ వేదికకు తల్లితండ్రులు, పిల్లలకు ఆహ్వానం.
ముందు మాట :
పిల్లలు కథలు వినడం , చదవడం ద్వారా వారికి మంచి ఊహా శక్తి పెరుగుతుంది. కథల ద్వారా వారి వివేకం , విజ్ఞానం , తెలివితేటలు పెంపొందుతాయి. ఇందుకు నిదర్శనం , ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు సినిమా "బాహుబలి " దర్శకులు S.S.రాజమౌళిగారు . తన చిన్నప్పటి నుండి కథలు చదవడం ద్వారా ఊహా శక్తిని ఎంతగానో పదును పెట్టి ఘన విజయం సాధించారు .
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి - సంస్కృత శ్లోకం చెప్పే విషయం : పాటల వలన పిల్లలు, పశువులు ఇంకా పాములు సైతం ఏంతో ఆనందాన్ని పొందుతారు . పద్యాలు చదవడం , పాటలు పాడడం ద్వారా ప్రఖ్యాత గాయని మణి , భారత రత్న అవార్డు గ్రహీత ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి గారు,మరియు తెలుగులోఘంటసాల వెంకటేశ్వరరావుగారు,పి. సుశీల గారు , ఎస్ . జానకి గార్లు , వారి సంగీతంతో మన అందరికి ఏంతో గొప్ప , ఆత్యాధ్యామికతను , ఆనందాన్ని సంసృతిని , సంప్రదాయాన్ని అందించారు.
పద్మ భూషణ్ శ్రీ వెంపటి చిన్న సత్యం గారు కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి అందించిన మహనీయులు. దేశ విదేశాలలో వారి శిష్యుల ప్రదర్శనలు నాట్యకళా వైభవాన్ని చాటుతున్నాయి .
"శ్రీ సత్తిరాజు లక్ష్మి నారాయణ " పద్మశ్రీ అవార్డు గ్రహీత మనఅందరికి "బాపు " గా సుపరిచితులు. బాపు గారు గీసిన బొమ్మలు , పెయింటింగ్ లు మన అందరి గుండెల్లో నిలిచి పోయాయి . బొమ్మలు , పెయింటింగ్ వంటి వాటి వలన పిల్లల మానసిక వికాసం యెంతో మెరుగుపడుతుంది.
" కుక్కపిల్ల , అగిపుల్ల ,సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం " అన్న మహాకవి "శ్రీ శ్రీ" ( శ్రీ రంగం శ్రీనివాసరావు " ) కవితలు మీకు అందరికి గుర్తు వుండే ఉంటుంది. సమాజంలో జరిగే మంచి చెడులను కాల మాన పరిస్థితులను సూటిగా , అర్ధవంతంగా ప్రజలలోకి తీసుకు వెళ్లగలిగే శక్తి కవిత్వానికి వున్నది. పిల్లలు తరగతి చదువులలో మంచి భాషా జ్ఞానం , గణిత ,ఆర్ధిక, చరిత్ర , సాంఘిక , జీవన , శాస్త్ర సాంకేతిక విషయాలు ఆకళింపు చేసుకుంటూ ఇతర వైవిధ్యమైన కళలలో కొంత మెళకువలు , అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం .
పిల్లలు ఏదైనా కళ పట్ల అభిరుచి కలిగి ఉంటే , దానిని తల్లితండ్రులు గుర్తించి , వారికి ప్రోత్సాహం అందిస్తే , వారు యెంతో ఉన్నతంగా ఎదుగుతారు.
ఈ బ్లాగ్ ద్వారా పిల్లలలో మంచి విషయాల పట్ల ఆశక్తి పెంపొందించాలని కోరుతున్నాను. మీ పిల్లలలో వున్న మంచి, మంచి ఆసక్తి కరమైన విషయాలను, నైపుణ్యాలను అందరితో పంచునేందుకు " మనశ్రీ కథాలయ " వేదికకు తల్లిదండ్రులకు , పిల్లలకు ఆహ్వానం.
ధన్యవాదములు
ముఖ్యంగా ఈ వేదికను మీ ముందుకు తీసుకురావడానికి , నేను చేసే ప్రతి మంచి పనిలోనూ నా వెనుక ఉండి , నన్ను ప్రోత్సహించే నా భర్త శ్రీ అగస్త్య .నరసింహారావు గారికి , బ్లాగును ముందుకు నడిపించడానికి , నాతో కలిసి పని చేస్తున్న బ్రహ్మణి మరియు లక్ష్మి తేజస్విలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.