నా పేరు ఆగస్త్య  శ్యామల.  ఎన్నాళ్ళ నుంచో  పిల్లలకు  సంభందించిన పాటలు  పద్యాలు   డాన్సు  కవితలు బొమ్మలు - ఇలా ఏన్నెనో విషయాలు ఒక చోటకు తేవాలని ఆశపడుతున్నాను . ఈ బ్లాగ్  ద్వారా పిల్లలలో మంచి  విషయాల పట్ల ఆశక్తి పెంపొందించాలని కోరుతున్నాను. ప్రియమైన  తల్లి తండ్రులకు  నా విన్నపము. మీ పిల్లలలో వున్న మంచి విషయాలను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను .   మీ అందరి ఆదరణతో పిల్లలకు ఎన్నో మంచి కధలు - కబుర్లు చెపుతాను. ఇక   " కోకిల కంఠం " కథలోకి వెళ్దామా . 

కోకిల కంఠం 


       హాయ్ పిల్లలూ ! మనందరికీ  కోకిల గొంతు అంటే చాలా .... ఇష్టం కదూ .  కోకిల కూ .........  కూ ....... అంటూవుంటే మనం కూడా దానితో కలిసి పాడాలని అనిపిస్తుంది కదూ. అయితే కోకిలమ్మకు ఆ గొంతు ఎలా వచ్చిందో తెలుసుకుందామా . 

       ఒకసారి భగవంతుడు పక్షులకు మంచి రంగులు వేయాలని అనుకున్నాడు .   ముందుగా  నెమలికి తన దగ్గర వున్న రంగులలో మంచి మంచి రంగులు ఎంచుకొని వేసాడు. నెమలి వెళ్లి , మిగతా పక్షులకు కూడా చెప్పింది. దాంతో పక్షులన్నీ దేవుడి ముందు " క్యూ " కట్టి నిలుచున్నాయి.  ఆయన దగ్గర వున్న రంగులలోనించి,  తమకు నచ్చిన రంగులు వేయించుకున్నాయి. 

    అయితే ఈ జాతర జరిగే సమయానికి కోకిలమ్మ వేరే ఊరు వెళ్ళింది. పాపం దానికి ఈ సంగతి తెలియదు. తీరా సాయంత్రం వచ్చేసరికి దేవుడి దగ్గర వున్న అన్ని రంగులూ అయిపోయాయి. ఇంకేం రంగులు మిగలలేదు కోకిలమ్మా !  నలుపు రంగు మాత్రమే మిగిలింది . అదే వేయించుకో అన్నాడు దేవుడు. ఏ రంగైతే ఏ మున్నది లెండి స్వామీ . " నలుపు " రంగే వేయండని, నలుపు రంగు వేయించుకుంది .   
  
      అప్పుడు గురుకువచ్చింది దేవుడికి.  కోకిలను నలుపు రంగు వేసుకోమన్నాను కానీ,
దీనికి , కాకికి తేడా ఏముంది? ఇద్దరిదీ  నలుపు రంగే అయ్యిందే అని  బాధపడ్డాడు. అయినా కోకిల మటుకు ఏమీ చిన్నపోలేదు. అప్పుడు కోకిలతో దేవుడు ఏమన్నాడు అంటే అందరికీ వాళ్ళు కోరిన రంగులు వేసాను. నీకు మాత్రం అట్లా కుదరలేదు. అందుకని ఒకపని చేస్తాను. నీ రంగు సంగతి ఎట్లావున్నా , నీకు మాత్రం మంచి ....  గొంతును యిస్తాను .  తీయని.....  నీ గొంతు వినగానే అందరూ నిన్ను" కోయిలా ...." అని గుర్తుపట్టేస్తారు . నీ పాట వినగానే  "వసంతం " వచ్చేసింది  అని అందరికీ  తెలుస్తుంది అన్నాడు దేవుడు.  
    
    ఆ రోజునుంచి  కోకిలకు  " మధుర స్వరం " వచ్చేసింది.  వసంతకాలం వచ్చేసిందని తన కూ ......  కూ ...... గానాలతో మనందరికీ కోకిలే చెపుతుంది .  బాగుందా పిల్లలూ ..  

                                                                   మీ అగస్త్య శ్యామల @ మనశ్రీ కథాలయ   
email id : syamalaagastya@gmail.com.