మేక పిల్లలకు పాఠం - నక్కకు గుణపాఠం
అనగా అనగా ఒక తల్లి మేకఉండేది. దానికి ఏడు బుజ్జి బుజ్జి పిల్ల మేకలు
ఉన్నాయి. వాటి రక్షణ కోసం తల్లి మేక మంచి ఇల్లు కట్టింది. ఉదయానే అవి తల్లితో పాటే
తోటలలోకి వెళ్ళి పచ్చి గడ్డి మేస్తూ, ఎప్పుడూ తల్లి మేక వెంటే తిరుగుతూ ఉంటాయి.
అవి చక్కగా ఆడుకూంటూ ఉంటాయి. ముద్దుగా ఉన్న ఆ మేక పిల్లల్ని ఓ నక్క చూసింది. అబ్బా! ఈ మేక
పిల్లలు ఎంత బాగున్నాయి. వీటిని తింటే ఎంత బాగుంటుంది అనుకుంది. తల్లి మేక లేకుండా
అవి ఎప్పుడు దొరుకుతాయా ? అని వాటిని దొంగచాటుగా గమనిస్తూ ఉండేది.
ఒక రోజు తల్లి మేక పిల్లలకు మంచి రుచికరమైన ఆహారం తెద్దామని దూరంగా ఉన్న
తోటలోకి వెళ్తూ, పిల్లలకు జాగ్రత్తలు చెప్పింది. అటువైపు నక్క తిరుగుతుందని,
ఇంటి తలుపులు తీసుకొని బయటకు రావద్దని చెప్పింది. ఎవరైనా తలుపులు తడితే, తన గొంతు విని
మాత్రమే తలుపులు తీయమని చెప్పింది. వచ్చినది తనా, కాదా తెలియాలంటే, తలుపు కింద ఉన్న కొద్దిపాటి సందు కుండా తన కాళ్ళనుచూసి, గుర్తించి
తలుపు తీయమంది. మీకు ఏమైన ప్రమాదం వస్తే ఇంటి వెనుక వైపు తలుపు గుండా బయటకు వచ్చేయండి
అని చెప్పింది. అలా జాగ్రత్తలన్ని చెప్పి బయలుదేరింది.
మేక ఒక్కటే దూరంగా వెళ్ళటం గమనించిన నక్క కొంతసేపు అయ్యాక మేక ఇంటి తలుపు తట్టి పిల్లలూ నేను
వచ్చేశాను. తలుపు తియ్యండి అని అంది. పిల్లలందరిలో చిన్నది అమ్మ వచ్చేసింది అని అంటూ
తలుపు తీయడానికి పరుగున వెళ్లబోగా, పెద్ద మేకపిల్ల
వారించి, అమ్మ చెప్పింది గుర్తు లేదా? అది
అమ్మ గొంతుకాదు. అమ్మ గొంతు
అలా బొంగురుగా ఉండదు. మనం తలుపు తీయకూడదు అని, మీరు మా అమ్మ కాదు. మేం తలుపు తీయం అన్నది. ఆది విన్న నక్క అక్కడ ఉన్న మామిడి చెట్టు చిగురులు తిని గొంతు సవరించుకొని
వచ్చి, పిల్లలూ తలుపు తియ్యండి అని అంది. అప్పుడు పిల్లలలో ఒక పిల్ల తలుపు సందులో నుండి
చూసి నక్క కాళ్ళు నల్లగా కనిపించగా, మా అమ్మవి
కాదు. మా అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు. అని అన్నది.
దానికి నక్క వెంటనే ప్రక్కనే ఉన్న పత్తి చేనులోకి వెళ్ళి, అక్కడ ఉన్న పత్తిని కాళ్లకు చుట్టుకొని వచ్చి పిల్లలూ తలుపుతీయండని పిలిచింది. పిల్లలు నక్క కాళ్లకు పత్తి ఉండటం వలన, అది వాళ్ళ అమ్మ కాదు అని తెలుసుకోలేక, వెంటనే తలుపు తీసాయి. బయట ఉన్ననక్కను చూడగానే, పిల్లలు భయంతో ఇంట్లోకి పరుగెట్టాయి. నక్క ఆహా నాకు భలే భోజనం దొరికిందని సంతోషిస్తూ, ఒక్కొక్క పిల్లని పట్టుకోడానికి ప్రయత్నించింది. నక్కకు దొరక కుండా పిల్లలు ఇంటిలోని వెనక వైపు తలుపు గుండా బయటకు పరుగెట్టాయి. ఈలోగా తల్లి మేక ఇంటివైపు రానే వచ్చింది. పిల్లలు పరుగెడుతూ ఉంటే చూసి పరుగున వచ్చి పిల్లలను అడిగింది. తల్లి మేకకు జరిగింది అంతా చెప్పాయి. చిన్ని మేక ఇంట్లోనే ఉండి పోయిందని గుర్తించి లోపలకు వెళ్ళింది తల్లి మేక. . ఈలోగా తనకు దొరికిన చిన్న పిల్లను నక్క అప్పుడే తన నోట కరచి పట్టుకుంది. తల్లి మేక వెంటనే తన వాడియైన కొమ్ములతో నక్క గొంతుమీద పొడిచింది. దాంతో నక్క బుజ్జి మేకను వదిలేసింది. బుజ్జి మేక తల్లి మేక దగ్గరకు పరుగెత్తుకొని వచ్చింది. అది చూసి మేక పిల్లలన్ని సంతోషంతో గంతులు వేశాయి. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటామని తల్లి మేకకు చెప్పాయి.
బ్రతికుంటే చాలు దేవుడా అనుకుంటూ దెబ్బ తిన్న నక్క పారిపోయింది.
0 కామెంట్లు