ఏనుగు గర్వభంగం
అనగా అనగా ఓ అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది. అది తోటి జంతువుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేది. పెద్ద చెట్ల కొమ్మలను విరిచేసి, పక్షులు కట్టుకున్న గూళ్లను పడవేసేది. పక్షులు గూళ్లలో పెట్టిన గుడ్లు అన్ని కింద పడి పగిలిపోయేవి. చిన్నచెట్లు ఉపేసి వాటిపై ఉన్న కోతులను పడవేసేది. నక్కల బొరియలు పాడుచేసి వాటికి నీడ లేకుండా చేసేది. సేలఏరు ప్రక్కన తిరిగే కప్పలను తొక్కివేసేది. చిన్న చిన్న జంతువు నుండి పెద్ద జంతువులను కూడా తన భీకరమైన ఘీంకారములతో భయపెట్టేది. తన కంటే ఎవరూ గొప్ప వాళ్ళు లేరని, తనే ఆ అడవికి రాజు అని భావిస్తూ, అన్ని జంతువులూ తనకు భయపడాలని, తన బలం ప్రదర్శిస్తూ ఉండేది.
చాలాకాలం ఇలా జరుగుతూ ఉండగా, దాని బాధ భరించ లేని పక్షులు, జంతువులు అన్నీ కలిసి మృగ రాజు సింహం వద్ద ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఏనుగుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని తర్జన బర్జనలు చేశాయి. అన్నిటికీ ఒకటే ప్రశ్న? అంత పెద్దదైన ఏనుగు ఆగడాలు ఎలా ఆపడం? అందులో ఓ తెలివైన రామచిలుక అంది, మీ అందరి సహకారంతో మనం సాధించవచ్చు అని తన ఆలోచనను అందరికి వివరించింది. దాని ఆలోచన సింహంతో పాటు అన్ని జంతువులకు నచ్చడంతో, కొంత స్తిమిత పడ్డాయి. అన్ని జంతువులు కలిసి తమ ఆలోచనలను అమలు పరచడానికి రంగం సిద్దం చేసుకున్నాయి.
తమ ఆలోచనలోని భాగంగా ఓ నక్క, ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళి మహారాజుగారికి నమస్కారం అని వంగి నమస్కరించి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంది. అది విన్న ఏనుగు, నక్క తనను "మహారాజు" అని పిలవగా లోలోపల సంతోషిస్తూ ఏం కావాలి? త్వరగా చెప్పు అంది. మహారాజా మేమందరం కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. మేమందరం మిమ్మల్ని సన్మానించదలిచాము. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని,అడవి మధ్యలో చేసుకున్నాము. అందరి తరపునా నన్ను మీ దగ్గరకు పంపారు. విషయం మీకు విన్నవించి, మిమ్మల్ని సాదరంగా తీసుకొని రమ్మన్నారు. అని అంది దానికి ఏనుగు చాలా సంతోషించి, అలాగా తప్పకుండా వస్తాను. పద అంది.
ముందు నక్క నడుస్తూ దారి చూపిస్తూ వెళుతుంటే, వెనక ఏనుగు వెళ్తూ ఉంది. అది రోజూ ఏనుగు తిరిగే ప్రదేశం కాదు. అలా కొంత దూరం వెళ్ళాక, బురద నేల వచ్చింది. నక్క తేలికైనది కాబట్టి ఒక్క వుదుకులొ గెంతి బురద నేలను దాటింది. దారి కొత్త అవటం వల్ల ఏనుగు మామూలు గానే అడుగు ముందుకు వేసింది. ఏనుగు కాలు పెట్టంగానే బురదలో దిగిపోయింది. కాలు బయటకు తీయటానికి ప్రయతీస్తూ ఉండగానే ఇంకా లోపలకు కూరుకుపోసాగింది. అప్పుడు అర్ధమైంది ఏనుగుకు తాను బురదగుంటలో కూరుకుపోయానని. భయంతో గజ గాజా వణికిపోయింది. నన్ను రక్షించు అని నక్కను అడిగింది.
అప్పుడు నక్క అంది ఇప్పుడు తెలిసిందా? పక్షుల గూళ్లు, వాటి గుడ్లు పడేసి, మా బొరియలు పాడుచేసి, చిన్న జంతువులను నీ కాళ్ళతో తొక్కేసి, చిన్న పెద్దా జంతువులను నీ ఘీంకారాలతో భయపెట్టి ఆనందించావు. ఇప్పుడు నీకు ఆపద వస్తే తెలిసిందా. మిగతా ప్రాణులు కూడా నీలాంటివే కదా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉంటానంటే అందరం కలిసి సహాయం చేస్తాము. అని అంది. నక్క మాటలకు ఏనుగు అంది నా తప్పు తెలిసి వచ్చింది. నన్ను క్షమించి రక్షించండి. ఇంక ఎప్పుడూ ఇలా చేయను అని అంది.
వెంటనే నక్క గట్టిగా కూత పెట్టగా, ప్రక్కనే పొంచి ఉన్న జంతువులు అన్ని బయటకు వచ్చాయి. వూబి ప్రక్కనే ఉన్న పెద్ద వృక్షం వూడలను చెట్టు పై నుండి కోతులు కిందకు వేయగా, వాటిని జీరాఫీ ఏనుగు తొoడానికి అందించిది. ఏనుగు ఆ వూడలను బలంగా పట్టుకుంది. రెండో వైపు నుండి సింహం, ఆ వూడలను పట్టుకుని ఉన్న ఏనుగును బురదగుంట నుండి బయట వైపుకు లాగింది. అలా ఆ జంతువులు అన్నీ కలిసి ఏనుగును బురదగుంట నుండి బయటకు తీసాయి. తనకు ప్రాణ భిక్ష పెట్టిన ఆ జంతువులన్నిటికి ఏనుగు కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుండి తాను కూడా ఇతర జంతువులతో స్నేహంగా మెలిగింది.
0 కామెంట్లు