పిచ్చుక గూడు

 అనగా అనగా ఓ జంట పిచ్చుకలు  కొబ్బరి పీచు, పుల్లలు ఏరుకొని తెచ్చి, ఓ చెట్టు మీద  చక్కని "గూడు"  కట్టుకున్నాయి. చలి, ఎండ, గాలి, వర్షం నుండి ఎంతో రక్షణ పొందేలా చక్కని గూడు తయారయ్యింది.  అందులో కొంత ఆహార ధాన్యాన్ని కూడా  దాచుకున్నాయి.   ఆ చెట్టు మీద కోతి ఒకటి ఉండేది.  దానితో పిచ్చుకలు స్నేహంగా ఉండేవి..   ఉదయానే  నిద్ర లేచి కిచ కిచ మంటూ సవ్వడి చేస్తూ, రెక్కల రెపరెపలతో సూర్యుడికి స్వాగతం పలుకుతాయి. పిచ్చుకలు రివ్వు రివ్వు మంటూ  ఎగురుతూ,  పంట పొలాల్లోని  పురుగులు, క్రీమి కీటకాల ను తింటూ పంటలకు  రక్షణ  కల్పించేవి. పొలాల్లో విహరించే రామ చిలుకలతో,  కొంగలతో, పావురాలతో, కాకులతో, ఇతర పక్షులతో స్నేహం చేశాయి. సాయంత్రం వరకు అన్ని పక్షులూ జతగా ఆహారం కోసం వెతికి, తిరిగి తమ గూటికి చేరుకొనేవి. కొద్ది కాలానికి పిచ్చుకలు ​గుడ్లు పెట్టి జాగ్రత్తగా వాటిని పొదిగి, పిల్లలైన తర్వాత, వాటికి ఆహారాన్ని అందిస్తూ, వాటికి రెక్కలు వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకునేవి.      రెక్కలు పూర్తిగా వచ్చి ఎగరగలిగిన పిల్లలు రివ్వు ...మంటూ ఎగిరిపోయేవి.

     అలా పిచ్చుకలు కాలక్షేపం చేస్తూఉండగా, రోజు ఉరుములతో, మెరుపులతో పెద్ద గాలి వాన వచ్చిపడింది. పిచ్చుకలు తమ గూట్లో  దాచుకున్న  ఆహారం తిని, హాయిగా నిద్ర పొసాగాయి.  రాత్రి వేళ ఎవరో గూటి తలుపులు టప టపా చప్పుడు  చేస్తున్న శబ్దం విని పిచ్చుకలు   ఎవరా! అని తలుపు తీసి చూశాయి. బయట ఓ కాకమ్మ నిల్చుని ఉంది. అది మొత్తంగా తడిచి ఉంది. ఏంటి కాకమ్మా ఇలా తడిచిపోయావు? అని అడిగాయి.  అప్పుడు కాకమ్మ అంది. ఈ గాలి వానకు నా గూడు పాడైపోయింది. నాకు కొంచెం చోటు ఇవ్వరా?  అని అడిగింది. అయ్యో! పాపం అని పిచ్చుకలు,  కాకికి తమ గూట్లో ఆశ్రయం ఇచ్చాయి. 

తాము దాచిన ఆహారం కొంచెం కాకికి ఇచ్చాయి.  అది తిన్న కాకికి ప్రాణం లేచివచ్చినట్లయింది. తెల్లవారిన తర్వాత కూడా కాకి నీరసంగా ఉండడం చూసి, కాకితో పిచ్చుకలు అన్నాయి.  నీకు కొంచెం శక్తి వచ్చేవరకు ఇక్కడే ఉండు అని.  దానికి కాకి చాలా సంతోషించింది. కాకికి కొంచెం ఆహారం పెట్టి , పిచ్చుకలు ఆహారం కోసం వెళ్ళాయి.  కాసేపయిన తర్వాత కాకికి కొద్దిగా ఓపిక వచ్చింది.  అప్పుడు పిచ్చుకల ఇల్లంతా చూసి, కాకికి అసూయ కలిగింది.  ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకోడానికి చాలా కష్ట పడాలి. మరలా ఎండలో తిరిగి పుల్లలు ఏరాలి.  ఇదంతా ఎందుకు?  పిచ్చుకలు ఇల్లు బాగా కట్టుకున్నాయి. వాటిని బయటకు గెంటి, ఇల్లు నేనే ఉంచుకుంటాను. అని ఆలోచించింది.

సాయంత్రం పిచ్చుకలు వచ్చిన తర్వాత, కాకి వాటిని గూట్లోకి రానివ్వకుండా ముక్కుతో పొడిచి, పొడిచి గాయపరచి బయటకు పంపేసి, గూటిని స్వంతం చేసేసుకుంది. కాకికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని అనుకున్నాయి పిచ్చుకలు.  అందుకు ఒక ఆలోచన  చేశాయి. వాటి స్నేహితుడైన కోతికి   విషయమంతా వివరించాయి. కాకి  చేసిన  పనికి  కోతికి చాలా కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకల గూటి తలుపు తట్టింది.  లోపల ఉన్న కాకి ఎవరూ? అంటూ తలుపు తీసింది. బయట ఉన్న కోతిని చూసి భయంతో బిక్క మొహం వేసింది.  అప్పుడు కోతి అంది,  నీది కాని గూటిలో నువ్వు ఎలా వుంటావు? బుద్ధిగా పిచ్చుకల గూడు వాటికి ఇవ్వు. కష్టపడి గూడు కట్టుకో, వేరేవాళ్ళ కష్టాన్ని నీ స్వంతం చేసుకోకు.  మరలా పిచ్చుకల జోలికి వస్తే  ఉరుకోను. నా తోకతో చుట్టి దూరంగా విసిరేస్తాను  అని భయపెట్టింది. మాటకు కాకికి బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడూ ఇలా చేయను, క్షమించమని పిఛ్చుకలను వేడుకొని అక్కడి నుండి తుర్రు మని పారిపోయింది.

 కోతి చేసిన సహాయానికి పిచ్చుకలు సంతోషంతోగంతులు వేశాయి.




Music by KineMaster

 

***

 

పక్షుల పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

పిల్లలూ కథలో కోతి పిచ్చుకలకు ఎంతో సహాయం చేసింది కదూ.  తనతో పాటు సహజీవనం చేసే చిన్న పక్షికి, కోతి సహాయం చేయగలిగినప్పుడు, చిన్న ప్రాణులను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చి ఇప్పుడు మనం కూడా పిచ్చుకలకు చాలా సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. కిచ కిచ మంటూ సవ్వడి చేస్తూ ఉదయానే వీనుల విందైన సంగీతాన్ని వినిపించే పిచ్చుకలు ఇప్పుడు  మనకు కనిపించటం లేదు. ఎందుకంటే కాలం మారిపోతుంది. రసాయనాలతో పెంచుతున్న ఆహారధాన్యాలు, పండ్లుతినడం వలన, టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతూ సెల్ ఫోన్ వాడకం కోసం చాలా చోట్ల టవర్లు ఏర్పాటు చేయడం వలన, వాటి నుంచి వెలువడే అయస్కాంత తరంగాల ధాటికి పిచ్చుకలు మనుగడ సాగించలేకపోయాయి. మెల్ల మెల్లగా అవి కనుమరుగవసాగాయి.  ఇప్పటికే పిచ్చుక అంటే మీకు పుస్తకాలలో పేరు మాత్రమే తెలుసు. బయటి తిరుగాడే పిచ్చుకలను మీరు చూసి ఉండి ఉండరు.

పిచ్చుకలతోపాటు మిగతా పక్షులను సంరక్షించడం మన బాధ్యత. దాని కోసం మనమందరం మనకు వీలైన పనులు చేయటం మరచిపోకండి. అవి ఏమిటి అంటే

1.సెల్ ఫోన్ వాడకం వీలైనంత తగ్గించండి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే సెల్ ఫోన్  వాడండి. సాధ్యమైనంత తక్కువ సమయం మాట్లాడండి. 

2. ఫోన్ మాట్లడేకన్నా, టెక్స్ట్ మెసేజ్ ఉపయోగించడం ద్వారా రేడియేషన్  తగ్గించగలం. 

3. ఫోనెలో ఇంటెర్నెట్ వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించండి.

4. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడవద్దు. వాడితే, దగ్గరలో ఉన్న మొబైల్ టవర్కు కనెక్ట్ అవటానికి  రేడియేషన్  మరింత ఎక్కువ అవుతుంది.

5. వీలైనంత వరకు ఒకే ఫోన్ లో 2 సిమ్‌లు వాడరాదు. దీని వలన రేడీయేషన్ ఎక్కువ అవుతుంది. 

ఇంకా మనం చేయతగిన పనులు కృత్రిమ పిచ్చుక గూళ్లు తయారు చేసి వాటికి ఆశ్రయం ఇవ్వటం. పక్షులకు మంచి నీటి సౌకర్యం, ధాన్యాలు అందించటం. వీటి ద్వారా పిచ్చుకలను మరలా మన ఇళ్ళలో చూసి, మనం, నేటి, రేపటి పిల్లలు కూడా ఆనందించే రోజు వస్తుందని ఆశిస్తాను. మీ కోసం కృత్రిమ పిచ్చుక గూళ్లు తయారు చేసే విధానం అందిస్తున్నాను. 



https://youtu.be/IUFCAboEfdo