తెలివైన కోరిక :
ఎల్లప్పుడూ తన కోసమే కాక అతనితో పాటు నివసించే వూరి ప్రజలకు కూడా మేలు జరగాలని ఆశించి , మంచి సమయం , సందర్భం వచ్చినప్పుడు తన తెలివి తేటలతో , రాజుగారిని తెలివైన కోరిక కోరి, తన వూరంతటికి చాలా మేలు చేసిన గోపి కథ ద్వారా మనం మన సమాజానికి ఉపయోగపడడానికి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ మన వూరిని , దేశాన్ని అభివృద్ధి లోకి తీసుకురావాలని తెలియచేసే కథను చూద్దామా.
ఇక కథ లోకి :
చాలా కాలం క్రితం ఒక రాజుగారు ఉండేవారు . ఒకసారి ఆయన వేటకి వెళ్లి , తిరిగి వస్తూ వస్తూ, మధ్యలో రథం దిగి ఒంటరిగా అడవిలోకి వెళ్లారు . ఆ సమయంలో అకస్మాత్తుగా పులి ఒకటి రాజుగారి మీదికి దూకింది. రాజుగారి పరివారం ఎవ్వరూ దగ్గర్లో లేరు. అయితే అటుగా వెళ్తున్న రాము , గోపి అనే స్నేహితులు ఇద్దరు తమ ప్రాణాలకు తెగించి పులిని ఎదుర్కొన్నారు. వారి వద్ద వున్న కట్టెలు కొట్టే కత్తులతో పులిని గాయపరచగా , ఆ పులి పారిపోయింది . అలా రాజుగారిని కాపాడారు.
రాజుగారు వాళ్ళిద్దరినీ చాలా మెచ్చుకున్నారు . వాళ్ళను రాజధానికి ఆహ్వానించారు . వాళ్ళకొక చక్కని విందు ఏర్పాటు చేశారు. విందు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరిని చెరొక కోరిక కోరుకోమన్నారు .
అప్పుడు రాము అన్నాడు. " అయ్యా ! నేను , నా కుటుంబం నివసించేందుకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు సరిపోవట్లేదు . నాకు ఇంకా పెద్ద ఇల్లు ఒకటి కట్టించి పెట్టండి " అన్నాడు. రాజుగారు సరేనన్నారు . దండనాధుడిని పిలిచి , రాము కోరిక నెరవేర్చమని ఆదేశించారు.
ఇక గోపి అన్నాడు. "మహారాజా ! సంతోషంగా జీవించేందుకు అవసరమైనవి అన్ని ఉన్నాయి నాకు. అయితే నాది ఒక్కటే కోరిక. తమరు ఒకసారి మాఇంటిని సందర్శించి , మా ఇంటి భోజనం స్వీకరించాలి అనేది." అన్నాడు.
" సరే తప్పక వస్తాం " అని అతనికి మాట ఇచ్చిన రాజుగారు "తగిన ఏర్పాట్లు చేయండి " అని మంత్రిని ఆదేశించారు.
రాజుగారి ఆదేశాల ప్రకారం దండనాధుడు రాముకి చక్కని ఇంటినొకదానిని కట్టించాడు. అతని కోరిక నెరవేరింది. అయితే మంత్రిగారికి మటుకు గోపి కోరిక తీర్చటంలో సమస్యలు ఎదురయ్యాయి. గోపి ఇల్లు చాలా చిన్నది. గోపి ఇంటికి వెళ్లే రోడ్లు కూడా అన్నీ పూర్తిగా గుంతలు పడి వున్నాయి. ఇక రాజుగారు తినగలిగే ఆహారం అక్కడ దొరికేటట్లు లేదు; నీళ్లు కూడా మురికిగా వున్నాయి.
దాంతో మంత్రి గారు ఆలోచించి , " అయ్యా ! నాకు ఒక ఐదు నెలల సమయం ఇప్పించండి " అని రాజుగారిని వేడుకొని, రాము, గోపీలు వుండే ఊరికి రోడ్డు వేయించాడు. గ్రామంలోని రోడ్లన్నిటిని సరిచేయించాడు. గ్రామం మొత్తానికి రక్షిత మంచి నీటి సౌకర్యం ఏర్పరచాడు. గోపికి పెద్ద ఇల్లు కట్టించాడు, కావలసిన కూరగాయలన్ని పండించుకునేందుకుగాను పెద్ద తోటను ఒకదానిని కేటాయించాడు. మొత్తానికి సర్వాంగ సుందరంగా తయారు చేయించాడు.
గోపి తెలివైన కోరిక పుణ్యాన గ్రామంలోని ప్రజలందరికి మేలు జరిగింది."రాజుగారికి భోజనం " పెట్టటం వల్ల గ్రామానికి ఎంత మేలు జరిగిందో తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ "గోపిని అభినందించారు."
0 కామెంట్లు