శ్రీకృష్ణలీలలు - గోపికమ్మ భక్తి
అందరికీ నమస్కారము. నిన్ననే మనమందరం శ్రీకృష్ణాష్టమి జరుపుకున్నాం కదా. మనందరం నిన్న కృష్ణుడికి పూజ చేసి ఇష్టమైన పాలు, మీగడ, వెన్నలతో ప్రసాదాలు చేసి ఆయనకు నైవేద్యం పెట్టాము కదా. అయితే ఓ చిట్టి గోపికమ్మ తాను కూడా కృష్ణుడికి చాలా రుచికరమైన పదార్ధాలు తయారుచేయాలని అనుకుంది.
అలా అనుకుని వంట చేయటం మొదలు పెట్టి, చేస్తూ, చేస్తూ, తాను చేస్తున్న పదార్ధాలలో రుచులు అన్ని సమపాళ్లలో ఉన్నాయో లేదో, రుచులు సరిగా లేకపోతే కృష్ణుడికి ఎలా పెడతాను? అనుకుంటూ వండుతున్న పదార్ధాలు కొద్ది కొద్దిగా రుచి చూస్తూ ఆహా ఈ వంటకం చాలా రుచిగా వచ్చింది, కృష్ణయ్యకు చాలా నచ్చుతుంది అనుకుంటూ కొద్ది కొద్దిగా, మొత్తం పదార్ధాలను ఆరగించేసింది.
తాను మొత్తం పదార్ధాలను ఆరగించిన విషయం గమనించుకొని,అయ్యో,ఇప్పుడు ఎలా ? కృష్ణయ్యకు ఇప్పుడు ఏం పెట్టాలి ? అని బాధపడుతూ దిగాలుగా కుర్చున్న గోపికమ్మ దగ్గరకు శ్రీకృష్ణుడు వచ్చి, ఏం గోపికమ్మా ఎందుకు అలా వున్నావు ? ఏం జరిగింది? అని అడిగాడు.
అప్పుడు గోపికమ్మ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అప్పుడు శ్రీ కృష్ణుడు నవ్వుతూ అన్నాడు. గోపికమ్మా నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే, నీవు చేసిన ప్రసాదాలు అన్నీ నేను ఆరగించాను. అని అన్నాడు. గోపికమ్మ ఆశ్చర్యంతో ఎలా తిన్నావు కృష్ణయ్యా? నేను నీకు ఏమీ పెట్టలేదుకదా ! అని అడిగింది.
అందుకు శ్రీకృష్ణుడు అన్నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారి హృదయములో నన్ను తలచుకొని, నాకు సేవ చేసినట్లు , ఏదైనా నాకు సమర్పించినట్లు భావిస్తూ, చేసే మంచి పనులు అన్నీ తప్పక నన్ను చేరుకొంటాయి. నాపై భక్తి శ్రద్ధలతో నీవు ఆరగించిన ప్రసాదాలు నేనే స్వీకరించాను అన్న శ్రీకృష్ణుని మాటలు విని గోపికమ్మ చాలా సంతోషంతో, శ్రీకృష్ణుని లీలలకు భక్తితో నమస్కరించింది.
0 కామెంట్లు